హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా దివాళీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న వేళ.. రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఖరారయ్యారు. కేవలం 42 ఏళ్ల వయసులో సునాక్ కొత్త చరిత్రను లిఖించారు. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలో అతిపిన్న ప్రధానమంత్రిగా రికార్డుల్లో చోటుదక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ మూలాలు, భారత సంతతి వ్యక్తులు పలువురు ప్రపంచంలోని పలు దేశాల్లో రాణిస్తున్నారు. మరి వారు ఏయే స్థానాల్లో ఉన్నారో చూద్దాం…..
కమలా హ్యారిస్:
కమలా హ్యారిస్ (Kamala Harris) ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారత్, జమైకా నుంచి ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. 2019 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బలంగా ప్రయత్నించారు. కానీ డెమొక్రాటిక్ పార్టీలో అంతర్గతంగా బిడెన్‌కే మద్ధతు దక్కింది. ఆమె ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
ప్రవింద్ జుగ్నౌ..
2017 నుంచి మారిషస్‌కు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రవింద్ పూర్వికులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. అహీర్ అనే హిందూ వర్గానికి చెందిన కుటుంబంలో ఆయన పుట్టారు.
ఆంటోనియో కోస్టా..
2015 నుంచి పోర్చుగల్ ప్రధాన మంత్రిగా పనిచేస్తున్నారు. పోర్చుగీస్ పౌరసత్వం కలిగివున్న ఆయన భారత సంతతికి చెందిన వ్యక్తి. గోవాలో కోస్టా అనే పదాన్ని ‘బబుష్’ (Babush)గా పిలుస్తారు. కోంకణి భాషలో ‘ప్రియమైన వ్యక్తి’ అని అర్థం.
పృద్విరాజ్సింగ్ రూపన్..
2017 నుంచి మారిషస్ అధ్యక్షుడిగా పృద్విరాజ్సింగ్ రూపన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారతీయ ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో రూపన్ పుట్టారు.
చన్ సంటొఖి..
చంద్రికపెర్సద్ ‘చన్’ సంటొఖి 2020 నుంచి సూరినామ్ దేశానికి ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. 1959లో ఇండో-సూరినామ్ హిందూ కుటుంబంలో జన్మించారు. మాజీ పోలీసు అధికారి అయిన ఈయన ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం సూరినామ్ 9వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మహ్మద్ ఇర్ఫాన్ అలీ..
మహ్మద్ ఇర్ఫాన్ అలీ 2020 ఆగస్టు 2 నుంచి గయానా 9వ ఎగ్జిక్యూటివ్‌గా ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో ఆయన పుట్టారు.
ఇంకా పలు దేశాలలో పలు రాజకీయ, పాలనా పరమైన కీలక పదవులలో అనేకమంది ఉన్నారు.