వేసవిలో లభించే మామిడి పండంటే ఇష్టంలేని వారుండరు. రుచే కాదు.. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. మామిడి పండ్లను ఎంజాయ్ చేయడానికి వేసవి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. మామిడి పండ్లకు ఉండే క్రేజ్ అలాంటిది. మామిడి పండులో విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా శరీరానికి ఎంతో అవసరమైన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
మామిడి పండును తరచూ తింటే గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చని నిపుణులు చెపుతున్నారు. “బీపీ కంట్రోల్లో ఉంటుంది. మామిడిలో ఉండే ఐరన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వల్ల గుండె నుంచి ప్రవహించే ధమనుల్లో ఎలాంటి అడ్డంకి లేకుండా కాపాడుతాయి. పాలీఫెనాల్ బయోయాక్టివ్గా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సీ సమృద్ధిగా లభ్యమవుతాయి. శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. మామిడి తొక్కలో ఉండే కెమికల్ శరీర కొవ్వును తగ్గిస్తుంది.” అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మామిడి పండును పండ్లలో ‘రారాజు’ అంటారు.