మంచి ఆహారం తినాలి అనుకుంటారు చాలా మంది. ఐతే… కొందరు మాత్రమే ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. చాలా మంది రోడ్లపై కనిపించే, దుమ్ము పడే ఆహారాన్ని తెలియక తినేస్తుంటారు. నోటికి రుచికరంగా ఉండే ఆ ఆహారం… మన శరీరానికి ఎంతవరకూ ఆరోగ్యకరమో ఆలోచించేది కొందరే. కానీ ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యమైనది. అనారోగ్యం వస్తే… ఒక్కోసారి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం ఉండదు. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నింటికంటే ముఖ్యం. మంచి ఆహారం తినాలి. బాడీకి అన్ని రకాల పోషకాలూ అందాలి. అలాంటి ఉద్దేశంతో ఉన్నవారు గుమ్మడికాయ, గింజల్ని తినడం మేలు. వాటిలో మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్స్, జింక్ వంటి పోషకాలుంటాయి. అందుకే మనం పంప్కిన్ (Pumpkin) సీడ్స్ రోజూ తింటే మంచిదే.ఈ సీజన్లో దొరికే గుమ్మడికాయల్లో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫైబర్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
- గుమ్మడికాయల్లో ఉండే ఫైబర్ అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవడం వల్ల చెక్కరస్థాయి కూడా తగ్గుతాయి. ఫలితంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. వీటిల్లో 90 శాతం నీరే ఉంటుంది. అందువల్ల క్యాలరీలు కూడా తక్కువగా లభిస్తాయి.
- గుమ్మడికాయల్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీనివల్ల కంటి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. గుమ్మడి కాయల్లో ఉండే లుటీన్, జియాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తాయి.
- గుమ్మడికాయల్లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, జలుబు వైరస్ల బారి నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
- గుమ్మడికాయల్లో ఉండే బీటా కెరోటిన్ సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్ (అతి నీలలోహిత) కిరణాల బారి నుంచి మన చర్మాన్ని సంరక్షిస్తుంది. గుమ్మడికాయ గుజ్జును ఫేస్ మాస్క్‌గా వేసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు పోతాయి.
- ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఎ, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లకు కారణం అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి. గుమ్మడికాయలను తరచూ తినడం వల్ల ప్రోస్టేట్, ఊపిరి తిత్తుల క్యాన్సర్లు రాకుండా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.