బయటకు వెళ్ళినపుడు నూనెలో వేయించిన చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాల్ని అబగా లాగించేస్తున్నారా? అయితే.. మీ ఆరోగ్యాన్ని డేంజర్ లో పెట్టినట్లే. ఖచ్చితంగా మీరు జాగ్రత్తపడాల్సిన విషయమే. ఎందుకంటే.. వాటి తయారీ కోసం చాలావరకు అప్పటికే వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. మొత్తంగా చూస్తే.. వినియోగించిన నూనెలో దాదాపు 60 శాతాన్ని మళ్లీ వంట కోసం వాడుతున్నట్లు తేలింది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్ఎఫ్).. కోన్ అడ్వైజరీ గ్రూప్, ఫిన్లాండ్కు చెందిన నెస్టేతో కలిసి కోల్కతా, ముంబయి, దిల్లీ, చెన్నై నగరాల్లో ఈ మేరకు ఓ అధ్యయనం చేపట్టింది.
ఈ క్రమంలోనే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వారిలో మార్పు తెచ్చేందుకు, అవగాహనను పెంచేందుకు ఒక విధానాన్ని రూపొందించాలని అధ్యయనం సూచించింది. ఈ దిశగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, వైద్యులు, పోషకాహార నిపుణులు, ప్రైవేట్ రంగ సంస్థలు పరస్పర సహకారంతో పని చేయాలని సూచించింది. వాడిన నూనె నిర్వహణ విషయంలో మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయడం ఆరోగ్యం దృష్ట్యా ఎంతో కీలకమని సహ అధ్యయనకర్త ఊమెన్ కురియన్ అన్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.