భాగ్యనగరం.. అంటే ధనవంతులకే కాదు.. పేదా, బీదా, బిక్కీ కూడా చేసుకునేందుకు పనులుంటాయ్. కష్టపడే తత్వం ఉన్నోళ్లు ఇక్కడ బతకడం సులువే. ముంబయ్, ఢిల్లీ వంటి చోట పని చేద్దామన్నా దొరకదు. చేసిన పనికి వచ్చే వేతనాలతో అక్కడ సామాన్యుడు, పేదోడు బతుకుపోరాటం చేయాల్సలిందే.
ఔను .. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో బతికేయడం చాలా సులభమని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. అటు సంపన్నులకు.. ఇటు సామాన్యులకు అనువైనది మన రాజధాని నగరం మాత్రమేనని అంటున్నాయి గణాంకాలు.
అద్దె పర్వాలేదు..
భారత్‌లో హౌజింగ్ విషయంలో అన్ని నగరాల కంటే హైదరాబాద్ ఆకర్షణీయంగా ఉందని మెర్సర్ తమ సర్వేలో తేల్చిచెప్పింది. ఇక్కడి సరసమైన ధరలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నది. అందుకే దేశీయ హౌజింగ్ మార్కెట్లో హైదరాబాదే ఫేవరేట్‌గా ఉందన్నది. తమ పరిశీలనలో అందరికీ చౌకగా హైదరాబాద్‌లోనే ఇండ్లు లభిస్తాయని స్పష్టమైనట్టు మెర్సర్ చెప్పింది. అద్దెల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూ రు నగరాలు దేశంలోనే చాలా ఖరీదైనవిగా ఉన్నాయి.
జీవన వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు దేశంలో హైదరాబాద్‌వైపే చూస్తున్నాయని మెర్సర్ తెలియజేసింది. భారత్‌కు ఆర్థిక రాజధానిగా ముంబై ఉన్నందున ఎన్నో బహుళజాతి సంస్థలు అక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాయని చెప్తూనే.. ద్రవ్యోల్బణం దృష్ట్యా హైదరాబాద్, చెన్నై, పుణె వంటి ప్రత్యామ్నాయ నగరాలపైనా అంతే స్థాయిలో దృష్టిసారిస్తున్నాయని పేర్కొనడం గమనార్హం.
మెర్సర్ సర్వే ముఖ్యాంశాలు
జీవన వ్యయంలో ప్రపంచంలోని టాప్-10 ఖరీదైన నగరాల్లో నాలుగు స్విట్జర్లాండ్‌కు చెందినవే. ఐదు ఖండాల్లోని 227 నగరాల్లో ఈ ఏడాది మార్చిలో సర్వే జరిగింది. హౌజింగ్, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం తదితర 200లకుపైగా అంశాల్లో ఖర్చుల ఆధారంగా నగరాలకు ర్యాంకులు ఇచ్చారు.
- ముంబైతో పోల్చితే హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతాల్లో బస ఖర్చులు 50 శాతానికిపైగా తక్కువే
- హైదరాబాద్, చెన్నైల్లో విద్యుత్తు, ఫోన్ల నిర్వహణ, గృహ సంబంధిత వినియోగాల వ్యయం తక్కువ. ముంబైలో ఎక్కువ
- సినిమా టిక్కెట్ల రేట్లు హైదరాబాద్‌లోనే అత్యంత తక్కువ. ముంబైలో ఇది ఎంతో ఖరీదైన విషయం
- దేశంలోని అన్ని నగరాల్లో పెట్రోల్ వ్యయం అధికం. కొత్త కార్ల ధరలు, వాటి నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే
- ఇతర నగరాలతో పోల్చితే పాలు, బ్రెడ్, కూరగాయల వంటి నిత్యావసరాల ధరలు కోల్‌కతాలో చౌక. ముంబై, ఢిల్లీల్లో చాలా ఖరీదు