మనకు చాలా అవసరాలుంటాయి. దాని కోసం తోటి మనిషి సహాయం అవసరం. కొన్ని పనులు కొంత మంది నేర్పుగా చేయగలుగుతారు. ఆ టాలెంట్ తో డబ్బులు సంపాదిస్తారు. యూకేకు చెందిన లారా యంగ్ వినూత్నంగా ఆలోచించింది. డబ్బులు సంపాదించేందుకు తన భర్తను అద్దెకిస్తోంది. దానికోసం ‘రెంట్ మై హ్యాండీ హస్బెండ్’ పేరుతో ఓ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసింది. చిన్నచిన్న పనులు చేసిపెట్టేందుకు తన భర్తను అద్దెకు ఇస్తున్నట్లు ఆమె చెపుతోంది. ఇళ్లలో ఫర్నీచర్‌ను సెటప్ చేసిపెడుతూ జీవనం సాగిస్తున్న ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆలోచనకు వచ్చినట్టు లారా చెబుతోంది. లారా భర్త జేమ్స్.. ఇంటి పనులు చేయడంలో దిట్ట. చిన్నచిన్న పనులను అలవోకగా పూర్తి చేస్తాడు. అవేంటి అనుకుంటున్నారా? పెయింటింగ్, డెకరేషన్, టైల్స్, కార్పెట్లు ఏర్పాటు చేయడం వంటి పనులు.
ఇంటి పనులు, గార్డెన్ పనులను మెరుగ్గా చేస్తారు. అది చూసి తనకు ఆ ఆలోచన వచ్చిందని చెప్పింది లారా. ఆయన స్కిల్స్‌ను ఉపయోగించుకొని అద్దెకు ఇవ్వొచ్చు కదా అని అనుకుంది. చాలా మందికి కూడా ఆ కాన్సెప్ట్ నచ్చింది. కొన్నిసార్లు చిన్నచిన్న పనులు చేసిపెట్టేందుకు ఎవరూ ముందుకురారు. ఫర్నిచర్ విడిభాగాలను కలిపి పెట్టడం, ట్రాంపోలిన్ ఏర్పాటు చేయడం, షెల్ఫ్‌లలో సామాను అమర్చడం వంటి పనులకు జేమ్స్ సరిగ్గా సెట్ అవుతాడు. భర్తలు ఆ పనులు చేసిపెడతారని మనం చాలా రోజుల నుంచి ఎదురుచూసి విసిగిపోతాం. అలాంటి పనులను చేసిపెట్టేందుకు ఒకరు దొరికితే మంచిదే కదా అంటూ చెప్పుకొచ్చింది. లారా యంగ్.
‘కొత్త వస్తువులు తయారు చేయడం అంటే ఆయనకు చాలా ఆసక్తి. మా ఇంటిని తీర్చిదిద్దేందుకు ఆయన్ను ఉపయోగించుకున్నా. స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులకు సైతం సాయం చేస్తున్నాం. టీవీని గోడకు అమర్చడం, గోడలకు పెయింటింగ్ వేయడం ఇలా.. ఇతరుల కోసమైతే.. 35 పౌండ్లను (సుమారు రూ.3,340) ఛార్జీలుగా వసూలు చేస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండాలనే తక్కువ ఛార్జీలు నిర్ణయించాం. దివ్యాంగులకు, 65 ఏళ్లు పైబడినవారికి డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాం’ అని చెప్పింది లారా. జేమ్స్‌ను అద్దెకు ఇస్తానని ప్రకటించగానే చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. వేరే అవసరాల కోసం ఆయన్ను అద్దెకు ఇస్తున్నానేమో అని భావించారని లారా చెప్పారు. కానీ నేనా ఆ పని చేయను. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా అలా చేయనని పేర్కొంది.