కొన్నేళ్లుగా భీకరమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మరోసారి తమ ప్రతాపం చూపారు. అదీ క్రికెట్లో పసికూనలుగా చెప్పదగ్గ నెదర్లాండ్స్‌పైన వారు విరుచుకుపడటంతో వన్డే క్రికెట్ చరిత్రలో వారి పేరునే ఉన్న అత్యధిక పరుగులు రికార్డును మరోసారి తిరగరాశారు. ఆమ్స్టెల్వీన్ వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో జరుగుతున్న మొదటి వన్డేలో ఇంగ్లండ్ జట్టు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 498 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ మొత్తం 26 సిక్సర్లు, 36 ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. వారి దూకుడుకు వన్డే హిస్టరీలోనే తొలిసారిగా 500 పరుగుల రికార్డు ఇంగ్లండ్ పేరిట నమోదవుతుందని అందరూ అనుకున్నా చివరకు ఆ మార్కుకు కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. అయినా ఇది గతంలో ఇంగ్లండ్ జట్టు పేరున ఉన్న 481 పరుగుల రికార్డు కన్నా మరో 17 రన్స్ ఎక్కువే. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 266 మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో ఏకంగా ముగ్గురు సెంచరీలు సాధించారు. వీరిలో జాస్ బట్లర్ కేవలం 70 బంతుల్లోనే 162 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. అయితే ఇంగ్లండ్ నెదర్లాండ్స్ లాంటి బలహీనమైన జట్టుపైన కాబట్టి ఈ స్థాయి స్కోరు నమోదైందని కొట్టిపారేసే అవకాశం లేదు. ఇప్పటిదాకా అత్యధిక పరుగులుగా ఉన్న 481 స్కోరును ఇంగ్లండ్ పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు పైన, మూడో అత్యధిక స్కోరుగా ఉన్న 444 పరుగులను మరో బలమైన జట్టు పాక్ పైనా సాధించడాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వన్డే క్రికెట్లో టాప్ 3 అత్యధిక స్కోర్లు ఇంగ్లండ్ జట్టు పేరిటే ఉన్నాయి. అయితే 400 పరుగులకు పైగా నాలుగుసార్లు చేసిన రికార్డు మాత్రం దక్షిణాఫ్రికా పేరున ఉంది.