వాహనాల రంగంలో ముఖ్యంగా కార్ల తయారీలో మెర్సిడెస్ బెంజ్ సంస్థకు ఉన్న ప్రత్యేకతే వేరు. కార్ల నాణ్యత విషయంలో ఈ కంపెనీ తనకు తానే కొన్ని ప్రమాణాలను నిర్దేశించుకుని వాటిని మరింత మెరుగుపరచుకునే దిశగా నిరంతరం పని చేస్తుంది. అందుకే దశాబ్దాలుగా ఈ సంస్థ తయారు చేసే కార్లపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ అంతకంతకూపెరుగుతూనే వస్తోంది. గతంలో జపాన్, కొరియన్ ఆటోమొబైల్ కంపెనీలతో పోటీ కారణంగా పలు అమెరికన్ కార్ల తయారీ సంస్థలు మూత పడిన కాలంలోనూ ఈ జర్మన్ కంపెనీ మాత్రం తన ఉత్పత్తి సామర్థ్యాన్ని స్థిరంగా పెంచుకుంటూ వచ్చిన ఘనత దక్కించుకుంది.
ఈ కంపెనీ తయారీ వాహనాల నాణ్యతలో ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందో తెలిపేందుకు ఆ కంపెనీ తాజాగా చేపట్టిన చర్యను పేర్కొనాలి. బ్రేకింగ్ సిస్టమ్‌లో సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది లక్షల పాత వాహనాలను మెర్సిడెస్-బెంజ్ రీకాల్ చేస్తున్నట్టుగా ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. దీనికి సంబంధించి ఆదివారం అధికారికంగా ప్రకటల వెలువడింది. ఈ కంపెనీ 2004-2015 మధ్యకాలంలో తయారు చేసిన SUV సిరీస్ ML, GL, R-క్లాస్ లగ్జరీ మినీ వ్యాన్లను రీకాల్ ప్రభావితం చేసినట్లు జర్మన్ మీడియా తెలిపింది. బ్రేక్ బూస్టర్‌పై తుప్పు పట్టడం వల్ల బ్రేక్ పెడల్, బ్రేకింగ్ సిస్టమ్ మధ్య కనెక్షన్‌కు అంతరాయం ఏర్పడుతోందని, ఈ కారణంగా సర్వీస్ బ్రేక్ పనిచేయడం ఆగిపోతుందని ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పేర్కొంది. ఈ రీకాల్ జర్మనీలో దాదాపు 70 వేల వాహనాలు సహా ప్రపంచవ్యాప్తంగా 993,407 వాహనాలకు వర్తించనుంది.