అమెరికాలో కొత్త రకం వైరస్ జనాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంకా పూర్తిగా తెలియని ఈ వైరస్ ను హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (Human metapneumovirus – HMPV) అని పిలుస్తున్నారు. నిజానికి ఇది కొత్త వైరస్ కాదు. కానీ దీని గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. ఈ కొత్త వైరస్ 2001లో తొలిసారి వచ్చింది. తర్వాత 2018లో తీవ్రంగా వచ్చింది. దీనిపై లాన్సెట్ గ్లోబల్ హెల్త్… 2020లో ఓ నివేదికను ప్రచురించింది. దాని ప్రకారం… 2018లో 1.40 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో 6 లక్షల మంది ఆస్పత్రులపాలయ్యారు. 5 ఏళ్లలోపు పిల్లలు 16వేల మంది చనిపోయారు.HMPV ప్రధానంగా శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఐతే.. పెద్ద వారిలో ఈ వైరస్ లక్షణాలు అంతగా కనిపించవు. వృద్దులు, ఆస్తమాతో బాధపడేవారు, ఐదేళ్లలోపు పిల్లలు, పసికందులపై ఇది ప్రభావం చూపిస్తోందని అమెరికాలోని… నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID) తెలిపింది. ఈ వైరస్ జీవితాంతం మళ్లీ మళ్లీ సోకుతూనే ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వైరస్‌కి విరుగుడుగా కంపెనీలు వ్యాక్సిన్ తయారుచేశాయి. కోవిడ్ 19కి వ్యాక్సిన్ తయారుచేసిన మోడెర్నా కంపెనీ… HMPVకి కూడా వ్యాక్సిన్ తయారుచేసి.. మొదటి ట్రయల్ పూర్తి చేసినట్లు తెలిసింది. లక్షణాలు : ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందికి జలుబు వస్తోంది. ఇది 2 నుంచి 5 రోజులు ఉంటుంది. చాలా మంది స్వయంగా రికవరీ అవుతున్నారు. ఇంకో విషయమేమిటంటే… ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికే సమస్య అవుతోంది. దగ్గు, జ్వరం ఉంటుంది. ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. కరోనా లాగానే ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తోంది. పరిశుభ్రతే ఈ వైరస్ నుంచి కాపాడుతుంది. కరోనాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో… అలాంటి జాగ్రత్తలే దీనికీ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే జనంలో మాత్రం దీనిపై కొంత ఆందోళన నెలకొంది.