సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు దూకుడెక్కువ. అంతకంటే నోటి దురద మరింత ఎక్కువ. పలు అంశాలకు సంబంధించి పలువురు సెలబ్రిటీలపై ఆయన తనకు తోచినట్టు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని అంశాల్లో ఆయన ముక్కుసూటితనం అర్థం చేసుకోదగినదే అయినా.. ఆయన అవతలి వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడితే ఎదురయ్యే పరిణామాలు అన్ని సందర్భాల్లోనూ అంత మృదువుగా ఉండవు మరి. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై ఆయన చేసిన విమర్శలకు ఆయనకు అలాంటి అనుభవమే ఎదురైంది.
చిరంజీవి భీమవరంలో జరిగిన ప్రధాని సభకు హాజరు కావడంపై నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు పనిలో పనిగా ఆ వివాదంలో ఆయన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురించి కూడా ప్రస్తావించారు. ఆయన మాటలు చిరంజీవి అభిమానులకు తీవ్ర ఆగ్రహం కలిగించడంతో వారు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా నారాయణను పరుష పదజాలంతో విమర్శించారు.
దీంతో నారాయణ తనమాటలు కేవలం భాషా దోషంగా భావించాలని చెపుతూ వాటిని వెనక్కుతీసుకుంటున్నట్టు ప్రకటించారు. రాజకీయంగా విమర్శలు చేయడం సహజమని, తనకు చిరంజీవి కుటుంబంతో ఆత్మీయ సంబంధాలున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే అంతకుమందు నాగార్జున విషయంలోనూ, బిగ్‌బాస్ విషయంలోనూ గతంలో నారాయణ తన పరిమితులను దాటి విమర్శలు చేశారన్న అభిప్రాయాలున్నాయి. ఎవరినైనా విమర్శించే హక్కు సీనియర్ రాజకీయ పార్టీ నేతగా ఆయనకు ఉండొచ్చు. ఆయన వాదనలో వాస్తవముండొచ్చు కూడా. అయితే లౌక్యంతో పాటు.. వాడే పదజాలం సభ్యతగా ఉంటే ఇలాంటి ఎదురుదెబ్బలు తగలకుండా ఉంటాయి మరి.