షాపింగ్ మాల్ ఓ చిన్నారిని బలితీసుకుంది. పిల్లలతో కలిసి సరదాగా బయటకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఏడాది వయసున్న బాబును కోల్పోయింది. ఎస్కలేటర్ ఎక్కున సమయంలో కన్న తండ్రి చేతుల్లో నుంచి జారిన పసికందు కిందపడ్డాడు. మూడో అంతస్తునుంచి పడిపోవడం మనసులను కలచివేస్తోంది. ఈ విషాద ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో సిటీ సెంట్రల్ మాల్ లో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ జంట షాపింగ్ కోసం వచ్చింది. భార్య షాపింగ్ చేస్తుండగా పిల్లలతో కలిసి భర్త బయట నిలుచున్నాడు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు కాగా, మరొకరు ఏడాది వయసున్న పసికందు. ఇంతలో ఎస్కలేటర్ ఎక్కేందుకు పెద్ద కొడుకు మారాం చేయడం, వద్దంటూ తండ్రి కట్టడి చేయడం కనిపించింది. ఈ క్రమంలో ఎత్తుకున్న చిన్న కొడుకు చేజారి కిందపడ్డాడు. కొడుకు జారిపడి ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు.