దక్షిణాది సినిమాల జోరుతో పోటీ పడలేక చతికిలపడుతున్న బాలీవుడ్ పరిశ్రమ గురువారం ప్రేక్షకులముందుకు వచ్చిన రెండు చిత్రాలపై గట్టి ఆశలే పెట్టుకుంది. బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్గా పేరున్న అమీర్‌ఖాన్, కరిష్మాకపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన లాల్ సింగ్ చద్దా వీటిలో ఒకటి. టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాడు. దీనితోపాటు మరో స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటించిన రక్షాబంధన్ కూడా గురువారమే విడుదలైంది.
రాఖీ పండుగ సందర్భంగా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు చిత్రాల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం బాలీవుడ్ వర్గాల్ని తీవ్రంగా నిరాశపరుస్తున్నట్టు తెలుస్తోంది. భారీ ప్రమోషన్లతో విడుదలైన చిత్రాలకు తక్కువ ఆక్యుపెన్సీ రావడం ఏమిటో అర్థంకాక మేకర్స్ అయోమయంలో పడ్డారు. అయితే జనాల్లో ఈ రెండు చిత్రాలపై పాజిటివ్ టాక్ ఉందని నెమ్మదిగా వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల వరుసగా బాలీవుడ్ చిత్రాలు భారీ నష్టాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ తలరాతను మార్చగలిగే చిత్రాలెప్పుడు వస్తాయో చూడాలి మరి.