- అమెరికాలో కొనసాగుతున్న చరణ్ సందడి
- ‘RRR’కు పనిచేయడం మాటల్లో వర్ణించలేని ఆనందం అని వ్యాఖ్య
- స్నేహబంధం వల్లే ‘నాటు నాటు పాట’ గొప్పగా వచ్చిందని వెల్లడి
చరణ్ బాల్యం, ఆయన పెరిగిన విధానం, తండ్రి చిరంజీవి క్రమశిక్షణ, తన దృష్టిలో ఆస్కార్ అంటే ఏంటి? వంటి విషయాలతో పాటు ఇంకా చాలా చాలా అంశాలపై ఈ సంభాషణ సాగింది. ఇందులో సరదా విషయం ఏంటంటే, తన మహిళా ఫ్యాన్స్ పంపిన కొన్ని మెసేజ్‌లను చరణ్‌తో చదివించడం .. వాటిని చదువుతూ చరణ్ మొహమాట పడటం .. సిగ్గుపడటం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. చరణ్ చెప్పిన కొన్ని విషయాలు ..
నాటు నాటు విశేషాలు
నాటు నాటు పాట కేవలం వినోదాత్మకంగా ఉండదు. ఆ సీక్వెన్స్‌ని రాజమౌళి చాలా అర్థవంతంగా తెరకెక్కించారు. ఆ పాటలో ఉన్న డ్రామా, ఎమోషన్స్ వల్లనే ఆ పాట ఆస్కార్ గడపను తొక్కగలిగింది. అవతలివారిని ఓడించిన తర్వాత తమలో తాము పోటీపడిన ఇద్దరు యువకులు, వారి ఆసక్తి, వారి పోటీతత్వం, ఉల్లాసం, హుషారు… ఇలాంటివన్నీ ఆ పాటను అత్యంత ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి.
ప్రతి అడుగూ మాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఒకే ఒక స్ట్రెచ్‌ని దాదాపు రెండు రోజులు చిత్రీకరించాం. ఇద్దరి అడుగులూ, ఊపునూ ఒకేలా సింక్రనైజ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ప్రతి స్టెప్పూ, ప్రతి కోణంలోనూ పర్ఫెక్ట్ గా కుదిరింది. కీరవాణి అద్భుతమైన బీట్స్ ఇచ్చారు. పాట అంత అద్బుతంగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఉక్రెయిన్‌లో నాటు నాటు పాట కోసం మేం స్టెప్పులు వేస్తున్న సమయంలోనే యుద్ధమేఘాలు ఆవరించాయి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయన ప్యాలస్‌లో మమ్మల్ని షూటింగ్ చేసుకోనిచ్చారు.
రామరాజు కేరక్టర్లో చాలా లేయర్స్ ఉంటాయి. అతని నిజమైన ఉద్దేశాన్ని అతను దాచుకుని ప్రవర్తించాలి. ఎన్నో వేరియేషన్లతో కూడుకున్న అత్యంత అందమైన కేరక్టర్ అది. ఆ రోల్ చేసిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఇప్పటికీ ఆ పాత్రతో గట్టి అనుబంధం ఉన్నట్టు, నాకు చాలా సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తోంది ఆ పాత్ర.
హాలీవుడ్ జర్నీ!
సినిమాను ఆరాధించే ఏ దేశానికి సంబంధించిన చిత్రంలోనైనా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం కోరుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టు ప్రణాళిక చేయాలి. దాన్ని సాకారం చేసుకోవాలి. నేను ఆ దిశగానే చర్చలు జరుపుతున్నాను. మాటల దశలో ఉన్నాయి. అయితే అవి సినిమాలుగా ఎలా షేప్ తీసుకుంటాయన్నది చూడాలి. కొన్ని నెలల్లో వాటికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి.
నాకు జూలియా రాబర్ట్స్‌తో పనిచేయాలని ఉంది. ఇండియాలో ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టామ్ క్రూయిజ్నీ, బ్రాడ్పిట్నీ, జూలియా రాబర్ట్స్ నీ ఇష్టపడనివారు ఎవరుంటారు? ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నన్ను ఇండియన్ బ్రాడ్‌పిట్ అంటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
నా దృష్టిలో ఆస్కార్!
మా దృష్టిలో ఆస్కార్ అనేది ఓ భావోద్వేగం. అక్కడ వెయిట్ చేస్తున్న మా నాన్నకు ఎమోషనల్ . మా సినిమా ‘నాటు నాటు’ ఆస్కార్‌కి రావడాన్ని మా నాన్న చాలా సెంటిమెంట్‌గా చూస్తున్నారు. దాదాపు 42 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన. ఆయన 80ల్లో ఒకసారి ఆస్కార్ ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఆయన వరకు అది చాలా గొప్ప అచీవ్మెంట్. ఎందుకంటే ఆస్కార్ ప్రాంగణంలో అడుగుపెట్టిన తొలి సౌత్ ఇండియన్ ఆయనే. అలాంటిది ఇవాళ మా పాట నామినేట్ అయింది. మాకు ఈ నామినేషన్ విలువ తెలియకపోవచ్చు. కానీ మా నాన్నకు తెలుసు. మేం మా కోసమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మేం ప్రార్థిస్తున్నాం. నా వరకు, ఆస్కార్ అనేది ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్ సాధించినదానితో సమానం… అని రామ్ చరణ్ ఉద్వేగానికి లోనయ్యారు.