సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంతవరకూ సంక్రాంతి ముఖ్యమైన సీజన్. భారీ బడ్జెట్ చిత్రాలు, స్ఠార్ హీరోల చిత్రాలు ఈ సమయంలో థియేటర్లలో సందడి చేసేందుకు పోటీ పడటం ఆనవాయితీ. సినిమాలో సత్తా ఉండాలే గానీ ఎన్ని సినిమాలు వచ్చినా బాక్సాఫీసు వద్ద కాసుల గలగలలు వినిపించడమూ చూసిందే. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా గడచిన రెండు సంక్రాంతి సీజన్లూ కళ తప్పాయని చెప్పాలి. అయితే వచ్చే సంక్రాంతికి మాత్రం ఈ పరిస్థితి ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అవును.. పెద్ద హీరోల సినిమాలన్నీ 2023 సంక్రాంతికి బరిలోకి దిగేందుకు శరవేగంగా సిద్ధమవుతున్నాయి.
కాగా మెగా కాంపౌండ్ నుంచే ఈ లిస్టులో ముగ్గురు హీరోల చిత్రాలు ఉండటం విశేషం. మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రంతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే హింటిచ్చారు. మరోపక్క పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. సృజనాత్మక దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమా 17వ శతాబ్దంలో జరిగే కథతో పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతోంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రాంచరణ్ కథానాయకుడిగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా స్థాయి మూవీ కూడా సంక్రాంతి సీజన్ లక్ష్యంగానే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, భారతీయడు-2తో పాటు తన ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించే ప్రయత్నంలో ఉన్నారు డైరెక్టర్ శంకర్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో రానున్న ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ప్రారంభంలోప్రేక్షకులను అలరించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఒకదానికొకటి పోటీ కాకుండా రెండు మూడు వారాలు అటూఇటూగా నైనా ఇవి రిలీజ్ కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. అంటే ఈ సంక్రాంతి మెగాభిమానులకు మరింత జోష్ తేనుందని ఫిక్స్ అయిపోవచ్చన్నమాట.