ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఉక్రెయిన్‌పై..రష్యా ఆక్రమణ ఉదంతం అంత తేలిగ్గా ముగింపునకు వచ్చేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్‌కు నాటో కూటమి దేశాలు ఆయుధ, ఆర్థిక సహకారం అందిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఒకపక్క రష్యా హెచ్చరికలు జారీ చేస్తున్నా అమెరికా దాని మిత్ర దేశాలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు, సహజవాయువు సరఫరా నిలిచిపోవడంతో యూరోప్ సహా పలు ప్రపంచదేశాలు ఆర్థిక మాంద్యం ఎదుర్కోవాల్సి వస్తుందన్న విశ్లేషణలు ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆ పరిణామాలకు సిద్ధపడి రష్యాను ఎలాగైనా నిలువరించడమే లక్ష్యంగా నాటో కూటమి పని చేస్తోంది.
గురువారం నాటో నుంచి కీలక ప్రకటన వచ్చింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొన్నేళ్లపాటు కొనసాగినా ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను, ఆర్థిక సాయాన్ని అందిస్తూ మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బెర్గ్ ప్రకటించడం ఆసక్తికర పరిణామమని చెప్పాలి. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ కోలుకోలేని విధంగా నాశనమవగా, రష్యాకు కూడా సైనికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్‌లో సామాన్య పౌరులపై, మహిళలపై రష్యా సైన్యం సాగిస్తున్న అకృత్యాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అయినా ఉక్రెయిన్ లొంగిరావడం లేదన్న ఆగ్రహంతో రష్యా మరింత తీవ్ర స్థాయి దాడులకు సిద్ధమవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలను నాటో పట్టించుకోకపోవడానికి తగిన కారణాలు ఉన్నాయి.
యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగించగలిగే పరిస్థితుల్లో రష్యా లేదని నాటో కూటమి భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా మిత్ర దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ప్రభావితమవుతోంది. దీనికి ముందుగానే సిద్దపడి ఉన్న కారణంగా రష్యా ఇప్పటిదాకా ధైర్యంగానే ఉంది. అయితే మరింతకాలం ఈ పరిస్థితి కొనసాగితే ఆ దేశం తట్టకోవడం కష్టమే. అందుకే యుద్ధం మరిన్ని రోజులు కొనసాగడం రష్యాకే ఇబ్బందికరమన్న సందేశాన్ని పంపించడం ద్వారా పుతిన్ దూకుడుకు అడ్డుకట్ట వేసి, శాంతి చర్చలకు రష్యాను ఒప్పించడం నాటో కూటమి వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక కీవ్‌లో యూరోపియన్ దేశాలకు చెందిన కీలక నాయకులు పర్యటించడం, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రస్ కూడా గురువారం ఉక్రెయిన్ను సందర్శించడం ఇందులో భాగంగానే భావించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.