సౌత్హీ హీరోయిన్ సమంత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు. ఇందువల్లే ఆమె ఈ మధ్య సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఆరోగ్యంపైన చాలానే రూమర్స్ వచ్చాయి. కానీ రెండు రోజుల క్రితం.. సమంత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అందర్నీ షాక్‌కు గురిచేసింది.చేతికి సెలైన్‌తో డబ్బింగ్ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను షేర్ చేసింది. తాను గత కొంతకాలంగా ‘మయోసిటిస్’ వ్యాధితో బాధపడుతున్నట్లు అభిమానులకు చెప్పింది. అభిమానులు చూపించే ప్రేమ, అనుబంధమే తనకు తన జీవితంలో ఎదురైయే ప్రతీ ఛాలెంజ్‌ను ఎదుర్కొనే శక్తిని ఇస్తోందని సమంత పోస్ట్‌లో పేర్కొంది. మయోసిటిస్ నుంచి కూడా త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం.. సమంతకు వచ్చి వ్యాధి గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వస్తుంది? ఎన్ని రోజులకు నయం అవుతుంది? వైద్య, పరిశోధన నిపుణులు చెబుతున్న అంశాలు ఏమిటి?
మయోసిటిస్..
మయోసిటిస్.. ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ ఒక్క వ్యాధి కారణంగా.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది శరీరాన్ని నెమ్మదిగా విచ్ఛిన్నం చేస్తుంది. మైయోసిటిస్ రుమటాలాజికల్ వ్యాధి అని డాక్టర్ బీరెన్ నద్కర్ణి చెప్పారు. ఈ సమస్య కారణంగా నడవడానికి ఉపయోగాపడే కండరాలలో వాపు, నొప్పి, బలహీనవపడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. మయోసిటిస్ ఐదు రకాలు ఉంటుందని డాక్టర్ వివరించారు.
పాలిమయోసైటిస్..
దీనిలో చిన్న పని చేయగానే అలసిపోతారు. కండరాల నొప్పి ఎక్కువగా ఉంటుంది. నడిచినప్పుడు ఒక్కోసారి అదుపు తప్పి కిందపడిపోతారు.
డెర్మటోమయోసైటిస్..
కండరాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. యూవీ కిరణాల ప్రభావం వల్ల డెర్మటోమయోసైటిస్ వస్తుందని కూడా పలువురు వైద్యులు సెలవిస్తున్నారు.
నెక్రోటైజింగ్ మయోపతి..
శరీర మధ్యస్థ భాగాల్లో కండరాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. మోచేతులు, తొడలు, నడుము, భుజాలు, మెడ, వెనుక భాగంలో నొప్పి ఉంటుంది.
ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్..
నీరసం, తొడ, ముంజేతి, మోకాలి కింద కండరాలు పట్టేసి, నొప్పిగా అనిపిస్తాయి.
జువెనైల్ ఫామ్స్ ఆఫ్ మయోసైటిస్..
పిల్లల్లో, యుక్తవయసు ఉన్నవాళ్లలో ప్రభావం చూపుతుంది.
ఏ లక్షణాలు కనిపిస్తాయి..
మయోసిటిస్ లక్షణాలు దాని రకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇది ఒక కండరం నుంచి స్టార్ట్ అయ్యి ఇతర కండరాలు, అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది. ఆ తర్వతా.. అన్నవాహిక, కళ్లు, గుండె కండరాలు బలహీనంగా మారవచ్చు. జ్వరం, దద్దుర్లు, తినడంలో ఇబ్బంది, అలసట, కండరాల నొప్పి, వంటివి ఈ వ్యాధి లక్షణాలు.
రావడానికి కారణం?
మయోసిటిస్ను ఇడియోపతిక్గా ప్రముఖ డాక్టర్ బీరెన్ నద్కర్ణి వర్ణించారు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, రోగనిరోధక వ్యవస్థ తప్పుగా పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ లేకపోయినా, దానితో అదే పోరాడుతూ ఉంటుంది. దీని వల్ల దద్దుర్లు, నొప్పి, బలహీనత వస్తాయి.
చికిత్స ఏంటి? ఈ వ్యాధికి కచ్చితమైన ట్రీట్మెంట్ లేదు. మయోసిటిస్ లక్షణాలను నియంత్రించడానికి ట్రీట్మెంట్, కొన్ని రకాల మందులు ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ మయోసిటస్ను నయం చేయడానికి ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని డాక్టర్ బీరెన్ నద్కర్ణి అన్నారు. ఇమ్యునోస్ప్రెసివ్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ ఈ ట్రీట్మెంట్ వాడతారని వివరించారు. వీటితో పాటు వ్యాయామం, స్ట్రెచింగ్, యోగా, పోషకర ఆహారం మయోసిటిస్ను తగ్గించడానికి కొంతవరకు సహాయపడతాయని చెపుతున్నారు. అయితే ఖచ్చితంగా ఈ వ్యాధి అనుమానాలు ఉన్నవారు వైద్య నిపుణుల్ని సంప్రదించాలని అంటున్నారు.