తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి గట్టెక్కేందుకు గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయ్లి. అయినా అమెరికా వంటి దేశాల్లో ప్రతిభావంతులైన భారతీయ నిపుణుల అవకాశాలకు కొదవ లేదు. అలా ఉద్వాసనకు గురైన వారిలో ఏ కొంత నైపుణ్యం ఉన్నా ఇతర అమెరికా కంపెనీలు భారతీయ టెక్నాలజీ నిపుణులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. దాదాపు అమెరికాలోని కంపెనీలన్నీ విదేశీ నైపుణ్యానికి పెద్ద పీట వేస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ ప్రతిభావంతులను పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తున్నాయి. దేశంలోని 89 శాతం కంపెనీలు.. ఉద్వాసనకు గురైన విదేశీ నిపుణులను రిక్రూట్ చేసుకున్నాయని ఎన్వాయ్ గ్లోబల్ సర్వేలో తేలింది. అలా నియమించుకున్న వారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడంలో ఆయా కంపెనీల హెచ్ఆర్ నిపుణులు బిజీబిజీగా గడుపుతున్నారని సర్వే నిగ్గు తేల్చింది.
గతేడాది ప్రారంభంతో పోలిస్తే, ఈ ఏడాది విదేశీ ప్రతిభావంతుల కోసం గిరాకీ ఎక్కువగా ఉంది. విదేశీ టెక్ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో ఆయా కంపెనీల హెచ్-1 బీ వీసా స్పాన్సర్‌షిప్‌లు ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 71 శాతం కంపెనీలు అత్యధిక విదేశీ నిపుణులను నియమించుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో హెచ్-1బీ వీసా దరఖాస్తుల సబ్మిషన్లో రికార్డు నెలకొల్పుతాయని అంచనా వేస్తున్నారు. 4.83 లక్షల హెచ్-1బీ వీసా దరఖాస్తులు రావచ్చు చెబుతున్నారు.
కొత్త నియామకాలకు బ్రేక్
ఆర్థిక మాంద్యం భయాలతో గతేడాది 78 శాతం కంపెనీలు కొత్త నియామకాలను నిలిపేయడంతోపాటు దాదాపు 51 శాతం విదేశీ వర్కర్లను సాగనంపాయని ఎన్వాయ్ గ్లోబల్ తెలిపింది. అమెరికాలోని టెక్ సంస్థల్లో హెచ్-1 బీ వీసాపై పని చేస్తూ.. కొలువులు కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం సంపాదించుకోవాలి. లేని పక్షంలో వారు స్వదేశానికి వెళ్లిపోవాలి. హెచ్-1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయ టెక్కీలే. వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయి.. భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ.. అమెరికాలోని పలు కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడం భారతీయ టెక్ నిపుణులకు ఆనందం కలిగించే విషయమే.