భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేసినా ప్రతీదానికి ఓ ప్రత్యేక కారణం, ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. …. ఒకసారి..గోకులంలో ఒక మహిళ బావి దగ్గర నీళ్ళు తోడుతోంది. కుండ నిండగానే ఎవరైనా ఆ కుండ తల మీద ఎత్తిపెడతారేమో అని ఇటూ అటూ చూసింది. అటుగా వెళుతున్న శ్రీ కృష్ణుడు. కనిపించాడు. “కృష్ణా కృష్ణా.” అని పిలిచింది. కృష్ణుడు వినిపించనట్టు వెళ్ళిపోయాడు. ఈయనకు ఏమైంది? అనుకుంటూ ఎలాగోలా కుండ ఎత్తుకొని ఇంటికి చేరుకుంది.
ఆమె కన్నా ముందు కృష్ణుడు వాళ్ళ ఇంటికి చేరుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. రా! కుండ దించి పెడతాను.” అన్నాడు.. ఆమె ఆశ్చర్యంతో అడిగింది. “అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటున్నావు. నాకేం అర్ధం కాలేదు. కృష్ణా!”, అంది… కృష్ణుడు నవ్వి, “నేను భారం దించేవాడిని, కానీ భారం మోపడం నా పని కాదు”, అని చిరు నవ్వులు చిందిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పరందాముడు.