ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై(Sam Altman) వేటుపడింది. శాల్ట్ ఆల్మన్ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ఓపెన్ఏఐ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. మైక్టోసాఫ్ట్(Microsoft) ఆర్థిక మద్దతు గల ఓపెన్ఏఐ కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే ఈ తొలగింపునకు కారణంగా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఆల్ట్మన్ తొలగింపు నిర్ణయం ప్రస్తుతం టెక్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. శాల్ట్ ఆల్మన్ స్థానంలో కంపెనీ తాత్కాలిక సీఈఓగా ప్రస్తుతం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్న మిరా మురాటీ వ్యవహరిస్తారని ఓపెన్ఏఐ వెల్లడించింది. కాగా ఆల్ట్మన్ తొలగింపు విషయమై ఓపెన్ఏఐ సంస్థ బోర్డు సమావేశం చర్చించింది. అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ‘‘బోర్డులో జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఆల్ట్మన్ నిజాయితీగా వ్యవహరించడం లేదు. సరైన సమాచారాన్ని కంపెనీతో పంచుకోకపోగా, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడుతున్నాడు. దీంతో కంపెనీకి నాయకత్వం వహించే ఆయన సామర్థ్యంపై బోర్డుకు ఏమాత్రం నమ్మకం లేదు.’’ అని ఓపెన్ఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది.