బయోపిక్ లు, పార్టీల నేపథ్యంతో వస్తున్న సినిమాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల రిలీజైన యాత్ర 2 సినిమా ఒక వర్గం ప్రజలలో కాక రేపుతుంటే మరో రెండు రోజుల్లో రామ్ గోపాల్ వర్మ వ్యూహం, ఇంకో వారంలో శపథం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవన్నీ జగన్ కు అనుకూల మూవీలు, కాగా ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనే పొలిటికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏపీ రాజధాని కథాంశంగా భాను తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఫిబ్రవరి 15న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలను ఆపాలని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా ఉందని అభ్యంతరం తెలిపారు. సినిమాను రెండుసార్లు వీక్షించి సర్టిఫికెట్ ఇచ్చామని సెన్సార్ బోర్డు తెలిపింది. వాదనలు విన్న ఏపీ హై కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది.