ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కారణంగా ఉత్పన్నమైన పరిణామాలతోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం పడింది. పలు దేశాల దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. సమీప భవిష్యత్తులోనే ప్రపంచం ఆర్థికమాంద్యంలోకి జారుకోవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు అంతకుమించిన పెనుముప్పు డ్రాగన్ రూపంలో ఎదురవుతున్న సంకేతాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తన హెచ్చరికలను పట్టించుకోకుండా.. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ దేశంలో పర్యటించడంపై చైనా ఆగ్రహంతో రగిలిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంత దూకుడుగా వ్యవహరిస్తోంది.
తైవాన్ను నలువైపుల నుంచి చుట్టుముడుతోంది. నాన్సీ పెలోసీ ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఏకంగా ఆ దేశ సముద్ర జలాల్లోకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మరోపక్క తైవాన్ జలాల్లోకి సైతం పలు క్షిపణులు ప్రయోగించి ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసింది. ఆసియాలోని అమెరికా మిత్ర దేశాలను భయపెడుతూ చైనా యుద్ధానికి కాలు దువ్వుతోంది. అమెరికాకు శిక్ష తప్పదని కూడా హెచ్చరించింది.
యుద్ధం తప్పదా..? వస్తే పరిణామాలెలా ఉంటాయి..?
ప్రస్తుతం చైనా లిబరేషన్ ఆర్మీ సన్నాహాలు చూస్తుంటే తైవాన్‌పై విరుచుకుపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి సైనికబలంలో చైనాకు, దానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపదేశమైన తైవాన్ కు పోలిక లేదు. అయితే అగ్రరాజ్యం అమెరికా అండగా ఉందన్న ధైర్యంతో తైవాన్ కూడా డ్రాగన్ తో యుద్ధం తప్పని పక్షంలో ఎదురొడ్డి నిలువరించేందుకు సన్నద్ధమవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం అటు చైనా.. దానిని అడ్డుకునేందుకు ఇటు అమెరికా మధ్య చాలాకాలంగా జరుగుతున్న పోరు ఈ పరిస్థితికి కారణం.
చైనా.. తైవాన్‌పై దాడికి పాల్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలోకి పడినట్టేనని చెప్పకతప్పదు. ఎందుకంటే తైవాన్ చిన్న దేశమై ఐనా.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అత్యంత కీలకమైన చిప్‌ల తయారీలో ప్రపంచంలోనే కీలక దేశంగా ఉంది. ఇప్పుడు యుద్ధం కారణంగా తైవాన్‌లో వాటి ఉత్పత్తి నిలిచిపోతే పలు బహుళజాతి కంపెనీలు సైతం సంక్షోభాన్ని ఎదుర్కోకతప్పదు. అన్నిదేశాలతో పాటు తయారీ రంగంలో మేటిగా ఉన్న చైనాపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఇక తైవాన్‌కు మద్దతుగా అమెరికా ప్రత్యక్షంగా యుద్ధరంగంలోకి దిగే అవకాశాలు లేకపోయినా చైనాపై తన మిత్ర దేశాలతో కలిసి తీవ్ర ఆంక్షలకు దిగడం ఖాయం. ఈ పరిస్థితి ప్రపంచాన్ని ఏదిశగా నడిపిస్తుందోనన్న భయాందోళనలు పెరుగుతున్నాయి.