ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి యూరప్ టూర్కు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరారు. . తన వ్యక్తిగత పర్యటనకు అనుమతించాలంటూ సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదన్న బెయిల్ షరతును సడలించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్పై సీబీఐ ఈ నెల 17వ తేదీన కౌంటర్ దాఖలు చేయగా కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు పచ్చజెండా ఊపింది. అయితే, పర్యటనకు ముందు జగన్ యొక్క మొబైల్ ఫోన్, ఈ మెయిల్ ఐడీ, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐ ఇవ్వాలని ఆదేశించింది.