” కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందనే అంశం ఇప్పటికీ అనుమానాలను బలపరుస్తూనే ఉంది. చైనాకు చెందిన ఒక రకమైన కుక్కల నుంచి ఈ వైరస్ బయటపడినట్లు మరో కధనం వెలుగులోకి వచ్చింది…”
కొవిడ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మూడేళ్లు గడుస్తున్నా..ప్రపంచ దేశాలు ఇప్పటికీ వైరస్ పుట్టుక ఎక్కడో స్పష్టంగా కనుగొనలేకపోతున్నాయి. వుహాన్‌లోని ‘రకూన్’ జాతి కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను ఓ అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. వాటి నుంచి ఇతర జంతువులకు లేదా మనుషులకు సోకి ఉండవచ్చునని లేదా వేరే జంతువుల నుంచే రకూన్ కుక్కలకు వైరస్ సోకి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అధ్యయనంలోని కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ తాజాగా వార్తా కథనం వెలువరించింది. జనవరి 2020లో వుహాన్‌లోని చేపల మార్కెట్ నుంచి సేకరించిన ‘స్వాబ్స్’ ఫలితాలను యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, ఉటా, సిడ్నీ, స్క్రిప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు విశ్లేషించారు. నిజానికి, వుహాన్ నుంచే వైరస్ ప్రబలిందన్న సంగతి ప్రపంచానికి తెలియగానే వుహాన్‌లోని చేపల మార్కెట్, కృత్రిమ వైరస్‌పై పరిశోధనలు జరిపిన ల్యాబ్‌ను చైనా మూసేసింది. దీంతో చేపల మార్కెట్లోని గోడలు, నేల, జంతువుల్ని తరలించే పరికరాల నుంచి శాంపిల్స్ సేకరించి విశ్లేషించారు.
కుక్కల నుంచి మరో జంతువుకు?
‘రకూన్ కుక్కల నుంచి సేకరించిన జన్యు సమాచారానికి, వైరస్ మూల కణానికి దగ్గరి పోలికలున్నట్లు గుర్తించారు. వుహాన్ మార్కెట్ నుంచి వచ్చిన జన్యు సమాచారంలో వైరస్ ఆనవాళ్లు కచ్చితంగా ఉన్నాయి. అయితే వుహాన్ ల్యాబ్, చేపల మార్కెట్ జంతువుల జన్యు సమాచారం ఏ కాలం నాటిది అన్నది తెలియాల్సిఉంది. అని ఉటాకు చెందిన వైరాలజిస్ట్ స్టీఫెన్ గోల్డ్‌స్టెయిన్ తెలిపారు. రకూన్ కుక్కల నుంచి నేరుగా మనుషులకు సోకిందనటానికి ఆధారాల్లేవని, ఆ కుక్క నుంచి వైరస్ మరో జంతువులోకి ప్రవేశిం చి ఉంటుంది..’ అని నిపుణులు బృందం తెలిపింది. ఆ కుక్కల జన్యు సమాచారంలో గుర్తించిన వైరస్‌కు, అక్కడి మనుషుల కొవిడ్ వైరస్ నమూనాలకు దగ్గరి పోలికలున్నాయని కూడా స్పష్టం చేసారు.