‘రామ చిలుక ఆచూకీ చెప్పి 85 వేలు గెలుచుకున్నాడో వ్యక్తి.’ కర్ణాటకలోని తుమకూరుకు చెందిన అర్జున్ అనే వ్యక్తి ఇంట్లో ఉండే చిలుక 20 రోజుల క్రితం తప్పిపోయింది. తన చిలుకను పట్టి తెచ్చినా లేదా ఆచూకీ చెప్పినా, అలాంటి వాళ్లకు 50 వేల రివార్డు ప్రకటించాడతను. రుస్తుమ్ అనే ఆఫ్రికన్ ప్యారెట్ జూలై 6 నుంచి కనిపించకుండాపోయింది. తుమకూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ చిలుకను గుర్తించాడు. చాలా క్షీణించి ఉన్న ఆ చిలుకను ఇంటికి తీసుకువెళ్లి ఆహారం ఇచ్చాడు. అయితే ఆ చిలుక ఓనర్లు దాని గురించి వెతుకుతున్నట్లు తెలుసుకున్న శ్రీనివాస్ శుక్రవారం రాత్రి దాన్ని ఓనర్కు అప్పగించేశాడు. తప్పిపోయిన చిలుక మళ్లీ ఇంటికి వచ్చిన ఆనందంలో ఉన్న ఓనర్ అర్జున్.. చిలుకను పట్టి తెచ్చిన వ్యక్తికి 85 వేల రివార్డును అందజేశాడు. ముందుగా ప్రకటించిన 50 వేల రివార్డు కన్నా.. అదనంగా మరో 35 వేలు ఇచ్చాడు. రెండేళ్లుగా తన వద్ద ఉంటున్న ఈ చిలక కోసం 85 వేలు ఖర్చు చేయడం తనకేమీ భాధ అనిపించలేదట.