సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆయన శైలికి సరిపోయే సరైన సబ్జెక్ట్ పడాలేగానీ బాలయ్య దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే. ఓ ఇరవై ఏళ్లు వెనక్కు వెళితే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీలు సృష్టించిన సంచలనం మన కనులముందు కనిపిస్తుంది. గత చిత్రాల రికార్డులన్నింటినీ తెరమరుగు చేసిన చిత్రాలివి. ఆ మాటకొస్తే అసలు రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల హవా మొదలైందే బాలయ్యతో. అంతకుముందు కూడా పలు ఇండస్ట్రీ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే యువ హీరోల హవా పెరగడం, మూస సినిమాలు, కథల ఎంపికలో జరిగిన పొరపాట్లతో వరుస పరాజయాలతో ఆ తరువాత ఆయన మార్కెట్ తగ్గింది. మధ్యలో సింహా, లెజెండ్ చిత్రాల విజయం బాలయ్య స్టామీనా ఏంటో చాటినా ఆ తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం దాకా మళ్లీ చెప్పుకోదగ్గ విజయం రాలేదనే చెప్పాలి.
అయితే రీమేక్ సబ్జెక్టులు ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నాలు బాలయ్య ఎప్పుడూ చేయలేదని ఆయనతో పనిచేసిన పలువురు దర్శకులు చెబుతారు. దర్శకులు చెప్పిన కథ నచ్చితే వారిని పూర్తిగా నమ్మి వెంటనే ఓకే చెప్పి ముందువెనుకలాలోచించకుండా సినిమా చేయడమే ఆయనకు తెలిసింది. గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి అలా తెరకెక్కిందే. అయితే ఇదే కారణంగా ఆయనను పలు పరాజయాలు పలకరించాయి. అయితే ఇటీవలి అఖండ చిత్రం మరోసారి తెలుగు ప్రేక్షకుల్లో బాలయ్య మేనియాను సృష్టించింది.ఆ సమయంలో తక్కువ టికెట్ రేట్లున్న ఏపీలో ఈ చిత్రం అందరూ ఆశ్చర్యపడే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. విచిత్రమేమిటంటే యువతలో తగ్గిపోయిందనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను మళ్లీ పెంచిందీ చిత్రం. అంతేకాదు.. ఇప్పుడు బాలయ్య చేయబోతున్న సినిమాలు కూడా ఆయన ఇమేజ్‌కు తగినట్టే రూపొందుతున్నాయి.
వీటిలో ఒకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, మరొకటి అనిల్ రావిపూడి డైరెక్టర్‌గా రూపొందుతోంది. ఈ రెండు ప్రాజెక్టులపైనా బాలయ్య అభిమానులకు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలుండటం విశేషం. అంతేకాదు.. యువ హీరోలతో బాలయ్య కాంబోలోనూ సినిమాల కోసం దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్యకు గత వైభవం తిరిగివచ్చినట్టే కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.