జమ్మూ కాశ్మీర్ సమీపంలో పహల్గాంలో జరిగిన మారణహోమం తరువాత భారతదేశానికి ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతోంది. పాకిస్థాన్ ఏకాకి అయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ పై క్రమంగా ఒత్తడి పెరుగుతోంది. దీనితో ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నోరు మెదిపారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
“జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఓ విషాదకర ఘటన జరిగింది. దీంతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఉగ్రదాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు మేము సిద్ధంగా ఉన్నాం. శాంతికే మేము ప్రాధాన్యత ఇస్తాం” అని షరీఫ్ పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న విషయాన్ని దాచిపెట్టి, ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లె వేశారు.
చర్చల ద్వారానే పరిష్కారం!
ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పరోక్షంగా స్పందించారు. “మా దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో ఎన్నటికీ రాజీపడం. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘ఇండియా ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఇలాంటి చర్యలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మేము చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలువురు పాక్ మంత్రులు భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను బలితీసుకుని నరమేధం సృష్టించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు ఆంక్షలు విధించింది. పాక్ పౌరులు తక్షణమే భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని లోలోపల భయంగానే ఉన్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు .