‘ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం.. ప్రధాని మోదీ సీరియస్  

Srinivas Vedulla

April 24, 2025

”ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమయింది . .” అని ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు . పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్‌ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి వేటాడి భారత్ హతమారుస్తుందని మోదీ స్పష్టం చేశారు.

కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని చెప్పారు.కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని మోదీ తెలిపారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని మోదీ హెచ్చరించారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని అన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు.

You May Also Like…