హైదరాబాద్లోని మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం అంటూ జరిగిన ప్రచారానికి తెరపడింది. దీనిపై అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఓ అపార్ట్మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచరించడం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతే కాదు నగరంలో ఈ ప్రచారం దుమారం రేపింది. అంతా చిరుత చిరుత అంటూ భయాందోళనలో పడ్డారు.
స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు చిరుత కోసం గాలించారు. చిరుత పాదముద్రలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. కానీ ఎక్కడా చిరుత పాదముద్రల ఆనవాళ్లు కనిపించలేదు.
అధికారులు ఇవాళ ఉదయం అపార్ట్మెంట్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులోని దృశ్యాల ఆధారంగా ఆ జంతువు కదిలికలను బట్టి అది చిరుత కాదని నిర్ధారణకు వచ్చారు. అది అడవి పిల్లి అని అటవీశాఖ అధికారులు తేల్చారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.