హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా డ్రామా హైలెవల్ లో నడుస్తోంది. ఆక్రమణలు అంటూ ప్రభుత్వం భవనాలను కూల్చివేస్తుంటే ప్రతిపక్షమైన బీఆర్ ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. బాధితులకు అనుకూలంగా మాట్లాడుతోంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మూసీ సందురీకరణ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు. అది మరింత విమర్శలకు తావిస్తోంది. దానివల్ల సుమారు 2లక్షల మందిని రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంబర్‌పేటలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన తమ పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులతో మాట్లాడారు.
అనంతరం ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. గతంలో పేదలకు ఇబ్బందులు కలుగకూడదనే తాము మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేశామని చెప్పారు. నగరంలో బీఆర్ఎస్కు ఓటు వేసిన వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని, లక్షలాది మందికి నిద్రలేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదల ఇళ్లను కూల్చుతుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని కిషన్‌రెడ్డికి చురకలంటించారు. ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వస్తే కంచెలు పెట్టాలని సూచించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.