cyclone effect:ఉత్తరకోస్తాకు వాయు‘గండం’

వర్షాలతో ఉత్తరాంధ్ర వణికింది. ఆదివారం  రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం  ఉదయం నుంచి రాత్రి 7 గంటల మధ్య విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఉత్తరాంధ్రకు వాయు ‘గండం’గా మారింది. వారం రోజుల్లో బుడమేరు ఎఫెక్ట్ తో  అతలాకుతలమైన విజయవాడ ఇంకా తేరుకోక ముందే.. మరో వాయుగుండం ఉత్తర కోస్తాను కలవరపెడుతోంది. ఈ వాయుగండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో శనివారం నుంచి బలమైన ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.   సోమవారం రాత్రి  వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కొన్నిచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ)

పూరి దగ్గర  తీరం దాటొచ్చు…

ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆదివారం ఉదయానికల్లా మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి ఆదివారం మధ్యాహ్నానికి కళింగపట్నానికి తూర్పుగా 270 కి.మీ., ఒడిశాలోని గోపాలపూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి పశ్చిమబెంగాల్‌, ఉత్తర ఒడిశా తీరాల వైపు చేరుకునే క్రమంలో సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. సోమవారం మధ్యాహ్నానికల్లా ఉత్తర ఒడిశాలోని పూరి, పశ్చిమబెంగాల్‌లోని డిఘా మధ్య తీరం దాటనుంది. తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మీదుగా జార్ఖండ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయు గుండం వలన సముద్రం నుంచి భారీగా వస్తున్న తేమ ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి

సముద్రం అల్లకల్లోల . .

ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కోస్తాలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ., అప్పుడప్పుడూ 70 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇంకా కోస్తాకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గాలుల వేగం పెరిగింది. కళింగపట్నం, భీమిలీ, విశాఖ, గంగవరం, కాకినాడ రేవుల్లో మూడో నంబరు, కోస్తాలో మిగిలిన రేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. రానున్న 24 గంటల్లో కోస్తాలో మత్స్యకారులు, ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. కాగా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా మేఘాలు ఆవరించాయి.   నాగావళి వరద ఉదృతి తో పార్వతీపురం మన్యం జిల్లాలో  పలు ప్రాంతాలలో వరద , భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండనుంది .