Congress: బీఆర్ఎస్ అసత్య ప్రచారం.. కాంగ్రెస్ ట్వీట్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిందంటూ బీఆర్ ఎస్ చేస్తున్న ప్రచారం అసత్యమని కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్ లో ఆరోపించింది. రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పురోభివృద్ధి సాధించిందని పేర్కొంది. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ అన్ రాక్ వెలువరించిన రిపోర్టే దీనికి నిదర్శనమని తెలిపింది. తెలంగాణ అధికార పార్టీ శనివారం అన్ రాక్ కంపెనీ విశ్లేషణలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ లను జతచేస్తూ ఎక్స్ ల పోస్టు చేసింది.  

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2023-2024 ఏడాది మొదటితో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2024-2025 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల ధరలు 37% పెరిగాయని అన్ రాక్ విశ్లేషించించిందని కాంగ్రెస్ తెలిపింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని బీఆర్ఎస్ కాలకేయులు చేస్తున్న ప్రచారానికి అన్ రాక్ నివేదిక చెంపపెట్టు అని ఘాటుగా విమర్శించింది. గడచిన ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందని అన్ రాక్ పేర్కొనట్లు తెలిపింది. రాజకీయ ఈర్ష్యతో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం బీఆర్ఎస్ దుర్నీతికి నిదర్శనం అని తెలంగాణ కాంగ్రెస్ మండిపడింది.