Alla Nani says Goodbye to YSRCP: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ సీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని ఆ పార్టీని వీడారు. దాంతో పాటుగా ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సైతం ఆయన తప్పుకున్నారు. కాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అవాంతరాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆళ్లనాని రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏలూరు నుంచి కీలక నేతగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవాన్ని కలిగి ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ ఏర్పాటు అయినప్పటి నుంచి జగన్ కు నమ్మకస్తుడిగా మెలిగారు. అటువంటి సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయడం వైఎస్ఆర్ సీపీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఆళ్ల నాని తన రాజీనామా వ్యక్తిగత కారణాల వలనని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్ లో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.