Rajya Sabha : రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎగువసభలో ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. భారత రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్యాన్ని ఎంపీ జయా బచ్చన్ కించపరిచారని ధన్ కర్ ఆరోపించారు. అయితే ఛైర్మన్ వ్యాఖ్యలపై ఎంపీ జయా బచ్చన్ అదేస్థాయిలో మండిపడ్డారు. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాను ఓ నటినన్న ఆమె ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోగలనని చెప్పారు. ఈ క్రమంలోనే గట్టిగా మట్లాడటం సరికాదని చెప్పారు. మీరు ఛైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ మనం అంతా ఒక్కటేనని ఎంపీ జయా బచ్చన్ అన్నారు.
ఎంపీ జయాబచ్చన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే ఛైర్మన్ ధన్ కర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్న ఆయన దయచేసి కూర్చోవాలని తెలిపారు. మీకు బయట చాలా పేరుండొచ్చు. యాక్టర్ ఎవరైనా డైరెక్టర్ చెప్పినట్లే చేయాలన్న ఆయన ఇప్పటివరకూ చేసింది చాలని పేర్కొన్నారు. మీరు సెలెబ్రిటీ అయినప్పటికీ ఇక్కడ సభా మర్యాదలు పాటించాలని స్పష్టం చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.