తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) సందడి మొదలైంది. తాజాగా ఓటర్ల జాబితా (Voter List) రూపకల్పన కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణలో ఎలక్షన్ వేడి రాజుకుంది.
ఓటరు జాబితాకు షెడ్యూల్ (Schedule) వచ్చిన నేపథ్యంలో దసరా నాటికి ఎన్నికలు రావచ్చని ఆశావాహులు భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు బూత్ ల వారీగా పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో అవలంభించిన రిజర్వేషన్లే ఇప్పుడు కూడా అమలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే బీసీ కులగణన (BC Census) చేపట్టిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉన్నప్పటికీ దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉంటాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ 6వ తేదీన గ్రామపంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఓటరు ముసాయిదా జాబితాను జారీ చేయనుందన్న సంగతి తెలిసిందే. దీనిపై సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు డీపీవో, ఎంపీడీవో (DPO and MPDO) ల నుంచి అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఉండనుంది. ఇక 19వ తేదీలోగా అభ్యంతరాలను స్వీకరించనున్న అధికారులు 21వ తేదీన వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.