Duleep Trophy : బంగ్లాదేశ్ తో జరిగే టెస్టులకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ జట్టుకు ఆడకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లు దేశవాళీ క్రికెట్ లో పాల్గొనాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఫార్మాట్ లో ఆడనున్న దేశీయ టోర్నీకి ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉండాలని సీనియర్ సెలక్షన్ కమిటీ కోరుతోంది. రోహిత్, విరాట్ కోహ్లీ మాత్రమే కాకుండా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శుభ్ మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్య కుమార్, కుల్దీప్ యాదవ్ లు టోర్నీలో ఆడాలని సీనియర్ సెలక్షన్ కమిటీ కోరిందని తెలుస్తోంది. అయితే ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2024 మరియు టీ 20 ప్రపంచ కప్ తరువాత విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో దులీప్ ట్రోఫీని ఆడటం లేదని సమాచారం.
దులీప్ ట్రోఫీలోని ఆరు మ్యాచ్ లు సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమై అదే నెల 24వ తేదీన ముగియనున్నాయి. ఇక భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. అలాగే ఈ దులీప్ ట్రోఫీని ఏపీలోని అనంతపురంలో ఆడాల్సి ఉన్నప్పటికీ.. ఆ ప్రాంతం విమానాల ద్వారా కనెక్ట్ చేయబడని కారణంగా బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఒక రౌండ్ ను ఆడే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని తెలుస్తోంది. అయితే రోహిత్, విరాట్ కోహ్లీ సెప్టెంబర్ 5న టోర్నమెంట్ ఓపెనర్ ఆడతారా? లేదా సెప్టెంబర్ 12న రెండో రౌండ్ లో ఆడతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.