Pawan Kalyan: వైసీపీ వాళ్లకు ఇంకా తిమ్మిరి తగ్గలేదు.. త్వరలోనే చూపిస్తాం: పవన్ కల్యాణ్

ఏపీ మంత్రి పవన్ కల్యాణ్ వైసీపీపై మరోసారి రెచ్చిపోయారు. వైసీపీ వాళ్లకు ఇంకా తిమ్మిరి తగ్గలేదని, వైసీపీ సోషల్ మీడియాపై పర్యవేక్షణ ఉంటుందని హెచ్చరించారు. ఐఎస్ జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన దీపం-2 సభలో మాట్లాడుతూ  మీరు చేసే ప్రతి వ్యాఖ్యను టైమ్ స్టాంప్ తో సహా, ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఆడ బిడ్డలపై ఎలాంటి దూషణలకు పాల్పడుతున్నాడు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు. ఇలా అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి అని హెచ్చరించారు. 

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆడబిడ్డలపై నీచంగా మాట్లాడుతున్నారు, అందరినీ గుర్తిస్తున్నాం. ఎవ్వరినీ వదిలిపెట్టం. త్వరలోనే ఇలాంటి వాళ్లకోసం డిజిటల్ ప్రైవసీ చట్టం తీసుకొస్తున్నాం అంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.  ఆ చట్టం  ఎలా పనిచేస్తుందో ఈలోపే మీకు చూపిస్తాం. ఎవరు తప్పు చేసినా వారిపై క్రిమినల్ రికార్డు ఉంటుంది. అందుకే, ముందుగా చెబుతున్నాను అంటూ రెచ్చిపోయారు.

వైసీపీ వాళ్లకు చింత చచ్చినా పులుపు చావలేదు. భవిష్యత్ లో  నోట మాట రాకుండా చేస్తాం. మళ్లీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో తిట్టేస్తాం అంటే ఇక కుదరదు. ఏది పడితే అది మాట్లాడుతాం అంటే నేను మీకు మాటిస్తున్నా… లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు. మీ సంగతి చూసే బాధ్యత నాది అని  హెచ్చరించారు.  అయితే ఆ చట్టం చాలా ప్రమాదకరం అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఆయన హెచ్చరికలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వైసీపీ నేతల పేరుతో తీసుకొచ్చే ఆ చట్టం వల్ల సాధారణ జనంకూడా మట్లాడలేని పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది మొత్తం ప్రజలను హెచ్చరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.