విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంలై వేలాది కార్మికులు నిరసన పోరాటాలు చేస్తున్నారు. కేంద్రం ఈ అంశాన్ని ప్రకటించి దాదాపు యేడాదిపైనే గడిచింది. అప్పటి నుంచి ఉక్కు కార్మికులు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సైతం స్పందించాయి. కార్మికులకు సంఘీభావం ప్రకటించాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉక్కు కర్మాగారాన్ని అదానీకి అమ్మేయడంపై అనేక ఆరోపణలు చేసింది.
ఇటీవల మరిన్ని ఆరోపణలు చేసింది. వాటిని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ఖండించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి స్పందించారు. గురువారం ఎక్స్ వేదికగానే ఆయనకూడా ట్వీట్ చేశారు. ఎన్డీఏ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తోందన్న ఆరోపణలు నిరాధారం, సత్యదూరమని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులను తొలగించారన్న విషయం తెలిసిన వెంటనే 48 గంటల్లోనే తిరిగి వారిని నియమించామని, సెప్టెంబర్ 27న తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను 29న మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రద్దు చేసిన 3,700 మంది కాంట్రాక్ట్ లేబర్ పాసులను ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా త్వరలో పునరుద్ధరిస్తామని ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న గేట్ పాస్ వ్యవస్థతో పాటు అవసరమైన సౌకర్యాలను కొనసాగించడానికి అన్ని పక్షాలూ చర్చల సమయంలో అంగీకరించారు… త్వరలోనే కార్మికుల బయోమెట్రిక్ డేటాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థలను సరిగా నిర్వహించడంతో మూడేళ్లలో వాటి షేర్ విలువ అద్భుతంగా పెరిగిందని కుమారస్వామి తెలిపారు.