సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో వచ్చే నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా పంపాలని వివిధ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమలులో లోటు పాట్లు, సూపర్ సిక్స్ పథకాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలానే గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైనా చర్చించే అవకాశం ఉంది. అమెరికాలో కేసు నమోదుతో బహిర్గతమైన అదానీ సంస్థల ముడుపుల వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. పలు ప్రధాన అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలను తీసుకోనున్నారు.