మెగాస్టార్ చిరంజీవి గురించి నాగార్జున కీలక కామెంట్స్ చేశారు. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు 2024 పురస్కారం చిరంజీవికి దక్కింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఏఎన్ఆర్ జాతీయ అవార్డు 2024 ప్రదానోత్సవ కార్యక్రమంలో హీరో నాగార్జున .. చిరంజీవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి హిట్లు, సూపర్ హిట్లు, రికార్డుల గురించి అందరికీ తెలుసుననీ, ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించారని అన్నారు. చిరంజీవితో తనకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. తాను సినిమాల్లోకి రావాలనుకున్న కొత్తలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నారని, అప్పుడు నాన్న ఏఎన్ఆర్ నన్ను పిలిచి ‘అక్కడ చిరంజీవి డ్యాన్స్ చేస్తున్నాడు, సినిమాల్లోకి వద్దామనుకుంటున్నావు కదా, వెళ్లి చూసి నేర్చుకో’ అని సూచించారని, అప్పుడు షూటింగ్ చూసేందుకు వెళ్లానని చెప్పారు.
రెయిన్ సాంగ్‌లో వైట్ అండ్ వైట్ డ్రెస్సులో రాధతో కలిసి చిరంజీవి డ్యాన్స్ చేస్తున్నారని, ఆయన డ్యాన్స్‌లో ఉన్న గ్రేస్ చూసి కొంచెం భయం పట్టుకుందని, ఆయన మాదిరిగా డ్యాన్స్ చేయగలుగుతానా అని అనిపించిందన్నారు. దాంతో సినిమా కాకుండా మరో దారి వెతుక్కోవడం మంచిదని మనసులో అనుకుంటూ బయటకు వచ్చేశానంటూ అప్పటి జ్ఞాపకాలను నాగార్జున గుర్తు చేసుకున్నారు.