బాబోయ్.. చలి.. వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు..

రెండు తెలుగు రాష్టాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వాతావరణ శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఏపీలోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి గజగజలాడిస్తోంది. నాలుగు గంటలకే దట్టమైన మంచుకప్పేసి మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలు చింతపల్లిలో నమోదయింది. ఉదయం పది అయితే గాని మంచు తెరలు వీడడం లేదు. చలి మంటలు వేసుకుంటు ఉపశమనం పొందుతున్నారు స్థానిక గిరిజనం.

అల్లూరు జిల్లా ఏజెన్సీ లో చలితివ్రత పెరుగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చింతపల్లి లో సింగల్ డిజిట్స్ కు పడిపోయింది ఉష్ణోగ్రత. ఈరోజు 7 ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాది ఈ సీజన్లో ఇదే అత్యల్పం. మినుములూరు లో 8, అరకులో 9, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఈరోజు నమోదయింది. మిగతా చోట్ల కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెరిగిన చలికి గడ్డకడుతుంది మంచు. ఆరుబయట పార్క్ చేసిన వాహనాలపై అక్కడక్కడా దృశ్యాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో మంచు పేరుకుపోయింది. డిసెంబర్ జనవరిలో ఉండాల్సిన చలి, కనిష్ట ఉష్ణోగ్రతలు నెల ముందే నమోదవుతున్నాయని అంటున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ చింతపల్లి అప్పలస్వామి.

అల్లూరు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో చలి ఈ సంవత్సరము ముందుగానే మొదలయింది. డిసెంబరు జనవరి నెలలో ఉండాల్సిన చలి తీవ్రత.. నవంబర్ నెల నుంచి మొదలైంది. ఇప్పుడు చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో 2023 నవంబర్ 12 వ తారీఖున 13.0 డిగ్రీలు గా నమోదయింది. ఈ సంవత్సరం నవంబర్ 19 తేదీన 11.3 డిగ్రీలు గా నమోదవడం విశేషం. అదేవిధంగా 2024 జనవరి 7వ తేదీని 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 2023 జనవరి 8వ తారీఖున 1.5 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈరోజు చింతపల్లిలో ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. చింతపల్లి పరిశోధన స్థానం ప్రకారం గత రెండు రోజులుగా చింతపల్లి, అరకు, డుంబ్రిగూడ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలో పడిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ నెలలో ఉండవలసిన వాతావరణ పరిస్థితి ఒక నెల ముందు నుంచే ప్రారంభమైంది ఇంకా కొనసాగుతూ ఉంది. మునుముందు ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మూడు రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. చలి గజగజ వణికిస్తున్నది. ఉదయం 9 గంటలు దాటినా చలి పోవడంలేదు. చిన్నారులు, వృద్ధులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంకాలం సమయంలో చల్లటి గాలులు వీస్తున్నాయి. ఘాట్ రోడ్ ప్రధాన రహదారుల్లో వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట మంచుతెరలు కమ్ముకోవడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వాహనాలకు హెడ్ లైట్లు వెలిగించుకొని ప్రయాణాలు చేయక తప్పడం లేదు .

పొగ మంచు ప్రభావం విమానాల రాకపోకలపై తీవ్రంగా పడుతోంది. విశాఖ ఎయిర్పోర్టులో దట్టంగా పొగ మంచు అలుముకుంది. 10 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. దీంతో సోమవారం కూడా ఉదయం హైదరాబాద్ చెన్నై బెంగళూరు నుంచి రావాల్సిన మూడు విమానాలు ఆలస్యం అయ్యాయి. హైదరాబాద్ విశాఖ హైదరాబాద్ ఇండిగో, చెన్నై విశాఖ చెన్నై ఇండిగో విమానాలు ఆలస్యమయ్యాయి. బెంగళూరు విశాఖ బెంగుళూరు ఎయిర్ ఇండియా విమానం విశాఖలో పొగ మంచు కారణంగా షెడ్యూల్ టైం కి బెంగళూరు నుంచి బయలుదేరలేదు. గత వారం రోజులుగా విశాఖ విమానాశ్రయంలో పొగ మంచుతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు పెరుగుతున్న చలి తీవ్రత పొగ మంచుతో ఏజెన్సీకి సందర్శకుల తాకిడి పెరిగింది. అరకు పాడేరు లోనే పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఎముకల కొరకే చలిలోనూ పర్యాటకులు ప్రకృతి ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.విమానాల రాకపోకలపై ప్రభావం..

జాగ్రత్తలు అవసరం..

ఉదయం, రాత్రి చలి తీవ్రతను తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు, తెల్లవారుజామున ఉన్ని దుస్తులు ధరించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.