వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టెస్ట్ సిరీస్ ముగింపు దశకు చేరింది. దీంతో ఫైనల్స్ కు చేరబోయే రెండు జట్లపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు రేసులో కనిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక జట్లు వరుసగా రెండవ, మూడవ, నాలుగవ స్థానాల్లో ఉన్నాయి.
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉండగా… బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ప్రస్తుతం మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ తొలి రోజు ఆట కొద్ది సమయం మాత్రమే జరిగింది. రెండవ రోజు ఆటకు వాతావరణం అనుకూలించినా, మూడవ రోజు మళ్లీ వర్షం కారణంగా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇక రానున్న రెండు మూడు రోజుల్లో కూడా బ్రిస్బేన్‌లో వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఒకవేళ ప్రతికూల వాతావరణం కారణంగా గబ్బా టెస్ట్ పూర్తిగా రద్దైతే డబ్ల్యూటీసీ ఫైనల్ సమీకరణాలు ఏవిధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవేల రద్దైతే ..
వర్షం కారణంగా గబ్బా టెస్ట్ మ్యాచ్ రద్దైనా లేక మ్యాచ్ డ్రాగా ముగిసినా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే సమీకరణాలు ఆసక్తికరంగా మారతాయి. మెల్బోర్న్, సిడ్నీ వేదికలుగా జరగనున్న తదుపరి రెండు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధిస్తే ఇతర ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
ఆసీస్‌పై భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంటే… ఈ సిరీస్ తర్వాత జరిగే సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో శ్రీలంక వైట్‌వాష్‌కు గురికాకుండా ఉంటే సరిపోతుంది. భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అదే భారత్-ఆస్ట్రేలియా సిరీస్ 2-2తో డ్రా అయితే మాత్రం ఆసీస్‌పై శ్రీలంక టెస్ట్ సిరీస్ గెలిస్తేనే భారత్‌కు మార్గం సుగుమం అవుతుంది.
అనూహ్యంగా భారత్-ఆసీస్ సిరీస్ 1-1తో సమం అయితే… శ్రీలంక-ఆస్ట్రేలియా సిరీస్ కూడా డ్రా అవ్వాలి లేదా ఆస్ట్రేలియాను శ్రీలంక ఓడించాలి. ఈ సమీకరణాల్లో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకునే దారులు మూసుకుపోతాయి.