డోకిపర్రుకి సీఎం చంద్రబాబు నాయుడు

డోకిపర్రు గ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు

శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు

సీఎం రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. అక్కడ కొలువుదీరిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నవమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సాయంత్రం బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అధినేత, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3.45 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరనున్నారు. సుమారు 4 గంటలకు డోకిపర్రు చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకోనున్నారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి పయనం కానున్నారు. మరోవైపు సీఎం రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.