దేశ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డు.. 6రోజుల్లోనే రూ.1000కోట్లకు చేరిన పుష్ప-2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప-2 దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పటికే చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రష్మిక మందన్న జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ పుష్ప-2 బాక్సాఫీస్ వ‌ద్ద‌ క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తోంది. డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా వ‌సూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లైన‌ ఆరు రోజుల్లోనే రూ. 1,000 కోట్ల కలెక్ష‌న్ల‌ మార్క్‌ను అందుకున్న తొలి భార‌తీయ చిత్రంగా నిలిచింది. ఈ మేర‌కు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ తాజాగా ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

“ది బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప‌-2’ చరిత్రను తిరగరాసింది. 6 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది” అంటూ మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్వీట్ చేసింది. మొత్తంగా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఆరు రోజుల్లో రూ. 1002కోట్ల గ్రాస్ వ‌చ్చిన‌ట్లు వారు పేర్కొన్నారు.  

ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వ‌సూళ్లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ఆరు రోజుల్లోనే బాలీవుడ్‌లో ఈ చిత్రానికి రూ. 375 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు రావ‌డం గ‌మ‌నార్హం. హిందీ ఇండ‌స్ట్రీలో అత్యంత వేగంగా ఈ స్థాయి వ‌సూళ్లు రాబ‌ట్టిన తొలి సినిమాగా నిలిచింది. ఇక 2021లో వ‌చ్చిన‌ ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ‘పుష్ప‌-2’ మొద‌టిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కొల్ల‌గొట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత వారాంతంలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. కాగా, ఈ చిత్రం విడుదలైన ఐదవ రోజు రూ. 900 కోట్ల మైలురాయిని దాటింది. 

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకున్న 8వ చిత్రంగా పుష్ప‌-2 నిలిచింది. అంత‌కుముందు దంగ‌ల్‌, బాహుబ‌లి-2, ఆర్ఆర్ఆర్‌, కేజీఎఫ్‌-2, జ‌వాన్‌, ప‌ఠాన్‌, క‌ల్కీ 2898 ఏడీ సినిమాలు ఈ ఘ‌న‌త సాధించాయి. ఈ మార్క్ దాటిన 8 మూవీస్‌లో 4 మ‌న తెలుగు సినిమాలే ఉండ‌డం విశేషం.