తెలంగాణ పోరాటంలో భాగంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించారు. తమ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేందుకు గాను తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక చిహ్నంగా ముందుకు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు చేస్తూ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యామ్నాయంగా మరో విధంగా విగ్రహాన్ని రూపొందించారు. దాని మీద విమర్శలు ప్రతివిమర్శలు ప్రారంభమయ్యాయి.
అయితే రేవంత్ రెడ్డి రూపొందించి విగ్రహ నమూనా బయటపెట్టారు. పైగా దానిని మంగళవారం ఆయన సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించనునన్నారని ప్రకటించారు కూడా. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు.
తెలంగాణ సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఈ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది. 17 అడుగుల ఈ విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు.
ఇప్పుడున్న తల్లి తెలంగాణ తల్లి రాజరిక భావనలు ఉట్టిపడేలా ఉన్నాయని, బంగారు కిరీటం, నగలతోపాటు అసలు ఒక సాధారణ తెలంగాణ ఆడపడుచు పోలికలు లేవని రేవంత్ రెడ్డి విమర్శలు లేవనెత్తారు. అందులో మార్పులు రావాలని వాదిస్తూ వచ్చారు. అందులో భాగంగా ప్రస్తుతం మరో విగ్రహానికి నాంది పలికారు. తెలంగాణ సంస్కృతి, ఆచారాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో కేటీఆర్ పలు విమర్శలు, ఎద్దేవాలు చేశారు. ఇప్పుడు అంత అర్జెంటుగా రూపం మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఆ మాత్రం కిరీటాలు, బంగారం ఉండకూడదా? ఉంటే తప్పేమిటి అంటూ విమర్శలు చేయడంపై చర్చసాగుతోంది. మొత్తం మీద చర్యలు, ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.