Gautam Adani: అదానీపై లంచం కేసుపై అమెరికా కీలక ప్రకటన

భారతీయ పారిశ్రామికవేత్త గౌతం అడానిపై అమెరికాలో లంచం కేసు నమోదైన సంగతి తెలిసిందే. దానిపై అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఈ కేసు విషయంలో అమెరికాతో పాటు భారత్, ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఈ సమస్యను అధిగమిస్తాయని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ పియర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అడానీ గ్రూప్‌పై ఆరోపణల విషయం తమ దృష్టికి వచ్చిందని పియర్ చెప్పారు. వీటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజీ) మాత్రమే సరైన సమాచారం ఇస్తారని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పట్లానే బలంగా ఉన్నాయని, ఈ సంక్షోభాన్ని అధిగమిస్తాయని అన్నారు.

గౌతం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైంది. సోలార్ పవర్ ఒప్పందాలకు సంబంధించి భారత్‌లో దాదాపు రూ. 2,100 కోట్లు (265 మిలియన్ డాలర్లు) లంచంగా ఇచ్చారని, ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారన్న అభియోగాలు నమోదయ్యాయి. అదానీ సహా 8 మందిపై కేసు నమోదయిన విషయం తెలిసిందే.