కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌

పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ జిల్లాలో భారీ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఏఎం గ్రీన్‌ కంపెనీ వెల్లడించింది. గ్రీన్‌కో సంస్థకు చెందిన ఈ అనుబంధ కంపెనీ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల సామర్థ్యంతో కూడిన గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి చేస్తామని వివరించింది. 2026 జూన్‌లోగా దీని నిర్మాణం పూర్తి చేస్తామని కంపెనీ పేర్కొంది. ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంతో ఏర్పాటైన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ‘ట్రాన్సిషనింగ్‌ ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌’లో చేరిన సందర్భంగా ఢిల్లీలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ఏఎం గ్రీన్‌ సంస్థ వెల్లడించింది. ఈ ప్లాంట్‌లో గ్రీన్‌ అమ్మోనియాను ఉత్పత్తి చేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని కంపెనీ చైర్మన్‌ అనిల్‌ చలమలశెట్టి తెలిపారు. ఏటా 10 లక్షల టన్నుల సామర్థ్యంతో 2026 ప్రథమార్ధం నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు. తొలుత అమ్మోనియా ప్లాంట్‌.. ఆ తర్వాత ఈ క్లస్టర్‌లోనే 2 గిగావాట్ల ఎలకృత్ పిట్ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ రాబర్టో బోకా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉన్న పునరుత్పాదక వనరుల లభ్యత ద్వారా కాకినాడ క్లస్టర్‌ అడ్వాన్స్‌ గ్రీన్‌ అమ్మోనియా, హైడ్రోజన్‌ ఉత్పత్తి అధికంగా చేపట్టే అవకాశం ఉందని వివరించారు. మొత్తం రూ.1,26,500 కోట్ల విలువైన పర్యావరణహిత పెట్టుబడులు ఈ క్లస్టర్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్‌ కర్మాగారాన్ని గత ఏడాది ఏఎం గ్రీన్‌ సంస్థ రూ.1,700 కోట్లకు కొనుగోలు చేసింది.