Ram Gopal Varma: హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటూ వినతి

‘వ్యూహం’ సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల వ్యంగ ఫొటోలను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానపై టీడీపీకి చెందిన మండల స్థాయి నేత కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం జరగాల్సిన పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ పెట్టారు.

మరోవైపు పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై

విచారించిన హైకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడం విదితమే. కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. పోలీసు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఈ క్రమంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ పేర్కొన్నారు. ఎవరి పరువుకూ భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.