RBI: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన

దేశంలో రూ.2వేల నోట్లను 2023 మే 19న ఉపసంహరించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన చేసే నాటికి దేశంలో 3.56లక్షల కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు, సంస్థలు, ప్రముఖులు వారి వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంక్‌లలో డిపాజిట్ లేదా ఎక్చేంజ్ చేసుకున్నారు.

అక్టోబర్ 7, 2023 వరకూ అన్ని బ్యాంకు బ్రాంచ్‌ల్లో రూ.2వేల నోట్లను డిపాజిట్ లేదా ఎక్చేంజ్ చేసుకునే సదుపాయం కల్పించిన ఆర్బీఐ.. ఆ తర్వాత ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో, ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో సైతం రూ.2వేల నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. తిరిగి బ్యాంకులకు వచ్చి చేరిన రూ.2వేల నోట్ల వివరాలపై ఆర్బీఐ సోమవారం కీలక ప్రకటన ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన రూ.2వేల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుండి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లుగా తెలిపింది. కేవలం రూ.6,970 కోట్ల విలువ కల్గిన రూ.2వేల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. తాజాగా ప్రజల వద్ద మిలిగి ఉన్న రూ.2వేల నోట్లపై ఆర్బీఐ ప్రకటన చేయడంతో వీటిపై ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది.