ఓ కానిస్టేబుల్ పాయింట్ బ్యాంక్ రేంజ్ లో తన పై అధికారైన ఎస్ఐపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో కుర్చీలో కూర్చున్న ఎస్ఐ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మణిపూర్ లోని జిరిబామ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుందీ ఘోరం. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మణిపూర్ లో కొంతకాలంగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు గ్రామాల్లో పోలీస్ పోస్ట్ లు ఏర్పాటు చేసి హింస చెలరేగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. జిరిబామ్ జిల్లా మాంగ్ బంగ్ గ్రామంలోని పోలీస్ పోస్ట్ లో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్, ఎస్సై షా జహాన్ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలోనే శనివారం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ముదరడంతో కానిస్టేబుల్ బిక్రమ్ జిత్ సింగ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఆ కోపంలోనే తన సర్వీస్ రైఫిల్ తీసుకుని ఎస్ఐ షా జహాన్ పై కాల్పులు జరిపాడు. చాలా దగ్గరి నుంచి బుల్లెట్ తాకడంతో షా జహాన్ అదే కుర్చీలో తుదిశ్వాస వదిలాడు. పోలీస్ పోస్ట్ లోని మిగతా సిబ్బంది బిక్రమ్ జిత్ ను అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్, ఎస్ఐల మధ్య వాగ్వాదానికి కారణమేంటనే విషయం ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు.