Nara Lokesh: అనంతపురంలో పెట్టుబడులు పెట్టండి.. మంత్రి లోకేశ్‌

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. టెస్లా ఎలక్రిక్ వాహనాల కంపెనీని ఏపీలో నెలకొల్పడానికి గల అవకాశాలపై  ఆ సంస్థ సీఎస్ ఓ వైభవ్ తనేజాతో మాట్లాడారు. అనంతరం  లోకేశ్ మాట్లాడుతూ సీఎం  చంద్రబాబు నేతృత్వంతో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తమ లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ, సహకారాలు అవసరమని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశార‌ని గుర్తు చేశారు. కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించార‌ని తెలిపారు.

అనంతపురం జిల్లాలో టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుంద‌న్నారు. ప్రగతిశీల నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన సులభతరమైన విధానాలు ఏపీలో అమలు చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం కావాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ఆశయాలకు అనుగుణంగా రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారిస్తే సహకారం అందిస్తామ‌ని తెల‌పారు. ఏపీ రాబోయే డేటా సెంటర్, ఐటీ హబ్‌లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజి పరిష్కారాలు అవసరం అని పేర్కొన్నారు.  అందుకే టెస్లా ఏపీకి వస్తే ఈ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుంద‌న్నారు. రాష్ట్రవ్యాప్త ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం కావాల‌న్నారు. ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిన టెస్లా ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.